కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, రోడ్డుపై బైఠాయింపు, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. బస్టాండ్ కూడలి వద్ద కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో వంటా-వార్పు నిర్వహించి ఎన్నికల హామీల అమలును డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల తరఫున ఈ నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,40,340 కోట్ల మేర బాకీ పడిందని ఆరోపించిన ఆయన, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలు కూడా అమలు కాలేదని అన్నారు.
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన కౌశిక్ రెడ్డి, ఇటీవల పంపిణీ చేసిన ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అప్పగించలేదని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో లక్ష ఎకరాలను బ్లాక్లిస్ట్లో పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, వట్టినాగులపల్లి వద్ద రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తిని దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. “కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామరక్ష…
తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా
” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెప్పుకున్న అభివృద్ధి పనులను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులపైనే 30 శాతం కమిషన్ ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని, డిపాజిట్లు సైతం దక్కవని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు, మహిళలు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











