వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ శోభాయాత్ర.
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రీ గౌరీదేవి అమ్మవారి విగ్రహ శోభాయాత్రను ఘనంగా నిర్వహించి, అనంతరం మూలవాగు వద్ద అమ్మవారిని కొలువుదీర్చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల మీదుగా మూలవాగు వరకు కొనసాగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్ర వాహనాన్ని స్వయంగా నడిపారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, మహిళల ఆటపాటలతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే పండుగ అని పేర్కొన్నారు. వేములవాడ ప్రజలకు, మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొనే మహిళలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ.. ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లుగానే ఈసారి కూడా గౌరీదేవి అమ్మవారిని శోభాయాత్రగా తీసుకెళ్లి మూలవాగు వద్ద ప్రతిష్ఠించినట్లు తెలిపారు. వేములవాడలో తొమ్మిది రోజుల సంప్రదాయానికి భిన్నంగా ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రత్యేకత అని పేర్కొన్నారు. దీనివల్ల మహిళలు పుట్టింట, మెట్టింట కూడా పండుగను సంతోషంగా జరుపుకునే అవకాశం ఉంటుందన్నారు.మూలవాగు వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం విద్యుత్ దీపాలంకరణ, తాగునీరు, పారిశుధ్యం, భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ మేనేజర్ సంపత్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్, పాలకవర్గ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.











