ఎస్ఐఆర్ లో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో రాజకీయ పార్టీలతో సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -05: ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ )లో భాగంగావేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీ ఎల్ ఏలతో నిర్వహించిన సమావేశానికి శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కింద నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్లు ఎందరు ఉన్నారని? నూతన ఓటర్లు ఎందరు దరఖాస్తు చేసుకున్నారో ఆరా తీశారు. మండలం మొత్తం 1,217 మంది నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కింద ఆయా ఓటర్లకు బూత్ లెవల్ అధికారి(బీ ఎల్ ఓ) ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి తీసుకోవాలని తెలిపారు.ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. తహసీల్దార్లు, బీఎల్ఓ సూపర్ వైజర్లు అన్ని గ్రామాల్లో . ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పరిశీలించాలని ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 06.09.2026 (ఆదివారం) అలాగే ఈ నెల 12.09.2026 (శనివారం), 13.09.2026 (ఆదివారం) లలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమము నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓటరు నమోదు అధికారుల (ఈఆర్ఓ/ ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో క్లెయిమ్లు, అభ్యంతరాలతో పాటు, ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా తమ క్లెయిమ్లు కూడా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ప్రణాళిక ప్రకారం చదవాలి
విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ప్రకారం చదవాలని తెలిపారు. చదవడంతో పాటు రాయడం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి రోజూ తరగతికి హాజరు కావాలని, ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు.
సమావేశంలో ఆర్డీవో కే ఎస్ బీ కుమారి, తహసీల్దార్ అబూ బాకర్ తదితరులు పాల్గొన్నారు.










