సిరివెలుగు, జగిత్యాల: మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చెత్త తరలించే వాహనంలో తరలించడంపై జగిత్యాలలో వివాదం నెలకొంది. జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెట్పల్లికి పంపించాల్సిన మట్టి వినాయక విగ్రహాలను చెత్త తరలించే వాహనంలో తరలించడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు.

విగ్రహాల తరలింపు కోసం మెట్పల్లి నుంచి జగిత్యాల కలెక్టరేట్కు మున్సిపల్ చెత్త వాహనాలను పంపించినట్లు ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలను చెత్త వాహనంలో తరలించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా సందర్భంగా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ బీజేపీ నాయకులతో మాట్లాడి, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.











