హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రూట్ రిహార్సల్.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి, ఐపీఎస్, వీబీ కమలాసన్రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్), ఓఎస్డీ ఐఎస్డబ్ల్యూ, డైరెక్టర్ టీజీఐసీసీసీ, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం ప్రయాణించే మార్గంలో రిహార్సల్స్ నిర్వహించారు. రూట్ క్లియరెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, సీఎం కాన్వాయ్ రాకపోకలు, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. భద్రతా ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.











