నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారాన్ని అందించడం లక్ష్యం.
చిన్నబోనాల ఎస్టీ గురుకుల పాఠశాలను పరిశీలన.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని చిన్నబోనాల ఎస్టీ సంక్షేమ హాస్టల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులతో పాటు కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ తోపాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడంతోపాటు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెనూలో మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని మంత్రి అన్నారు. చిన్నబోనాల ఎస్టి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి వాటిని వెనక్కి తీసుకొని నాణ్యమైన బియ్యం పంపించాలని అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు. అదేవిధంగా చిన్నబోనాల గురుకుల పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలకు అంచనాలు తయారు చేసి అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.











