సిరివెలుగు కరీంనగర్ : ఆస్తి వివాదంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన అగుర్ల లింగయ్యకు ఫ్యామిలీ కోర్టు, 4వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.10 వేల జరిమానా కూడా విధించింది. 2022 అక్టోబర్ 24న ఇరుకుల్ల గ్రామంలో తనకు రావాల్సిన భూమి వాటాను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని తల్లి, తమ్ముడితో లింగయ్య గొడవకు దిగాడు. ఆగ్రహంతో రోకలిబండతో వారి తలలపై దాడి చేయగా తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకోని రిమాండ్ కు తరలించారు . వైద్య, ఎఫ్ఎస్ఎల్ ఆధారాలతో నేరం రుజువు కావడంతో శుక్రవారం కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026లో ఇది 21వ కన్విక్షన్ కావడం గమనార్హం. కేసు దర్యాప్తు, న్యాయపరమైన ఆధారాల సమర్పణలో కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.











