సిరివెలుగు సిరిసిల్ల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి కోరారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలు నీటిలో త్వరగా కరగకపోవడంతో పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందని తెలిపారు. సహజ రంగులతో తయారైన మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణహితంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల రాములు, కూర భాగ్యలక్ష్మి దేవరాజ్, బొద్దుల శ్రీనివాస్, ఆడెపు చంద్రకళ ప్రభాకర్, అడిచెర్ల రూపా సాయికృష్ణ, కల్లూరి రేణుక రాజు, కొండ వర్షిణి నరేష్, కోఆప్షన్ సభ్యుడు నంది శంకర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.











