ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్న
వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు
సిరివెలుగు, హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ దాదాపు వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ అందించామని, 72 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ప్రతిపక్ష పాత్ర పోషించాలి.
ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇంకా ఏమైనా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా అనుభవంతో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారని, అలాంటిది మాజీ ముఖ్యమంత్రి వెయ్యి రోజులుగా అసెంబ్లీకి ఒక్కసారి కూడా రాకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చింది?.
తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నాలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











