ఈసీ అధికారాలు జేబు సంస్థలా భావించొద్దని హితవు.
ఓట్ల చోరిపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమా అంటూ సవాలు.
సిరివెలుగు, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థలా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే తామే తిరిగి చేర్పిస్తామనడం ఏమిటని ప్రశ్నించిన పొన్నం.. ఏయే బూత్లు, వార్డుల్లో ఓట్లు తొలగించబడ్డాయో క్షేత్రస్థాయిలో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమ వద్ద ఆధారాలున్నాయని, బాధితులను తీసుకొచ్చి వాటిని చూపిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఫామ్-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ఫిర్యాదులు చేశారా లేదా అన్నదానిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫామ్-6, ఫామ్-7 దరఖాస్తుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ఓటు హక్కు విషయంలో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి పౌరుడి హక్కును కాపాడాలని మంత్రి అన్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా ఎంఐఎం, ఓవైసీ పేర్లను ప్రస్తావిస్తూ అంశాన్ని మతపరమైన కోణంలోకి మళ్లించడం సరికాదన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు.కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలు, రైతుల సంక్షేమంపై కేంద్రం అందించిన సహకారంపై సమాధానం చెప్పాలని కోరారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనపెట్టి ఓటర్ల జాబితాపై పారదర్శకతకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం సూచించారు.











