కేసీఆర్ పాటలు, బీఆర్ఎస్ నేతల డాన్సులు.
భారత కాన్సుల్ జనరల్ సమక్షంలో రాజకీయ ప్రసంగాలు.!
సంస్కృతి, సంప్రదాయాల వేడుకల్లో రాజకీయ ప్రచారం.
ఆడబిడ్డల అసహనం, నిర్వాహకుల తీరుపై విమర్శలు.
సిరివెలుగు, దుబాయ్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు విదేశీ గడ్డపై రాజకీయ రంగు పులమడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే బతుకమ్మ వేడుకలకు దుబాయ్లో రాజకీయ ప్రసంగాలు,పార్టీ అనుకూల నినాదాలతో రాజకీయ సభలను తలపించాయన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు వచ్చిన తెలంగాణ మహిళలు, ప్రజలు బిఆర్ఎస్ నేతల రాజకీయ ప్రచారంతో తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలిసింది.
బతుకమ్మ వేదికపై రాజకీయ సందడి.!
దుబాయ్లో పలు తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాల్సిన వేదికపై కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రసంగాలు సాగడం వివాదానికి కారణమైంది. ఈ వేడుకల్లో బీఆర్ఎస్కు చెందిన పలువురు ప్రస్తుత,మాజీ ఎమ్మెల్యేలు,ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై కేసీఆర్కు మద్దతుగా నేతలు మాట్లాడటంతో పాటు రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ వాఖ్యనించడం పట్ల స్థానిక తెలంగాణ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బహిరంగ చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పండుగను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన సమయంలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తేలేత్తుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు మహిళలు, ప్రజలు ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
భారత కాన్సుల్ జనరల్ సమక్షంలో రాజకీయ ప్రసంగాలా!?
విదేశీ గడ్డపై జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ఐక్యతను, తెలుగు ప్రజల గౌరవాన్ని చాటిచెప్పేలా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత కాన్సుల్ జనరల్ సమక్షంలోనే రాజకీయ ప్రసంగాలు చోటుచేసుకోవడం నిర్వాహకుల తీరుపై విమర్శలకు దారితీసింది. నేతల రాజకీయ ప్రసంగాలపై భారత కౌన్సిల్ జనరల్ కూడా కొంత ఇబ్బందికి లోనయినట్లు స్పష్టంగా కనిపించింది. అధికారిక, సాంస్కృతిక వేదికలపై రాజకీయ పార్టీల ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కార్యక్రమం అసలు ఉద్దేశమే దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలకు చెందిన తెలంగాణ ప్రజలు పాల్గొనే పండుగను ఒక పార్టీకి అనుకూలమైన వేదికగా మార్చడం సరికాదని పలువురు అభిప్రాయాపడుతున్నారు.
కేసీఆర్ పాటలు మొదలవగానే..వెళ్లిపోయిన మహిళలు.?
ఈ వేడుకల్లో కేసీఆర్, కేటీఆర్లకు అనుకూలంగా పాటలు వినిపించడంతో రాజకీయ వాతావరణం మరింత పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పాల్గోన్న తెలంగాణ జానపద కళాకారిణి ఒకరు బతుకమ్మ పండగను పక్కన పెట్టి బిఆర్ఎస్ పార్టీ సభను తలపించేలా కేవలం కేసీఆర్, కేటీఆర్ పాటలు మాత్రమే పాడారు. ఈ సమయంలో కొందరు మహిళలు కొంత ఇబ్బంది పడి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అక్కడి వారు చెబుతున్నారు. రాజకీయ నినాదాలతో కూడిన పాటలు, ప్రసంగాల పట్ల తెలంగాణ యువతలోనూ ఆశించిన స్థాయిలో ఉత్సాహం కనిపించలేదని కార్యక్రమానికి హాజరైన కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలకు సంబంధించి నిర్వాహకుల వివరణ, హాజరైన వారి స్పందనలు స్వతంత్రంగా ధ్రువీకరించాల్సి ఉంది.
బతుకమ్మ తెలంగాణ పండుగ కాదా.?
బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం, ప్రకృతితో ముడిపడిన జీవన సంస్కృతి. తరతరాల సంప్రదాయాలకు ప్రతీక. రాజకీయాలకు అతీతంగా మహిళలంతా ఒక్కచోట చేరి పాటలు పాడుతూ, ఆటలాడుతూ జరుపుకునే ఈ పండుగకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యం ఉంది. అలాంటి వేడుకల్లో రాజకీయ పార్టీల ఆధిపత్యం కనిపిస్తే పండుగ అసలు స్ఫూర్తి దెబ్బతింటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో నివసించే తెలంగాణ ప్రజలకు బతుకమ్మ వేడుకలు తమ మాతృభూమితో అనుబంధాన్ని గుర్తుచేసే అరుదైన సందర్భాలు. ఈ వేడుకలను రాజకీయ వేదికలుగా మార్చడం వల్ల పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాల్సిన తెలంగాణ సమాజంలో అనవసర విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ సభలైతే ముందే ప్రకటించండి!
బతుకమ్మ వేడుకలను నిర్వహించే పలు సంఘాలు నిర్వాహకులు అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించాలని పలువురు సూచిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలనుకుంటే ఆ విషయాన్ని ముందుగానే స్పష్టంగా ప్రకటించాలని, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ప్రజలను ఆహ్వానించి అనంతరం పార్టీ ప్రచారానికి వేదికగా మార్చడం తగదని ప్రవాస తెలంగాణ ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల్లో తెలంగాణ సంస్కృతిని కాపాడటం, భావితరాలకు మన సంప్రదాయాలను పరిచయం చేయడం, ప్రవాస తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం సంఘాల ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని వారు పేర్కొంటున్నారు.
పండుగకు ప్రాధాన్యమా.. రాజకీయాలకా..?
దుబాయ్ బతుకమ్మ వేడుకల చుట్టూ తలెత్తిన ఈ వివాదం ప్రవాస తెలంగాణ సంఘాల నిర్వహణ తీరుపై చర్చకు తెరలేపింది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించాలా? లేక అందరినీ కలుపుకొనే సాంస్కృతిక వేదికలుగా బతుకమ్మ వేడుకలను నిలబెట్టాలా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బతుకమ్మ పండుగ ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదు. అది యావత్ తెలంగాణ సమాజానికి చెందిన సాంస్కృతిక వారసత్వం. రాజకీయాలకు అతీతంగా,అన్ని వర్గాల భాగస్వామ్యంతో పండుగను నిర్వహించినప్పుడే దాని అసలైన స్ఫూర్తి నిలుస్తుంది. విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే వేదికలు రాజకీయ ఆధిపత్యానికి కాకుండా తెలంగాణ ఐక్యతకు ప్రతీకలుగా నిలవాలన్నదే పలువురి అభిప్రాయం. ఏది ఏమైనా దుబాయ్ లో పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ నేతల సంబరాలపై గల్ఫ్ కార్మికుల ప్రశ్నలు!
కేసీఆర్ పదేళ్ల పాలనలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఎన్నారై పాలసీ అమలు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి, మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఎన్నారై పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి గతంలో ఏం చేశారో చెప్పకుండా, పండుగల పేరుతో గల్ఫ్ దేశాల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి స్పష్టమైన హామీలు, కార్యాచరణ ప్రకటించకుండా సంబరాలు చేసుకోవడం దేనికోసం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమమే రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రాధాన్యత కావాలని కార్మికులు కోరుతున్నారు. వ్యక్తుల స్వార్థం కోసం తెలంగాణ పండగలను గల్ఫ్ సంఘాల నిర్వాహకులు రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గల్ఫ్ కార్మికులు హెచ్చరిస్తున్నారు.











