
సిరివెలుగు, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఆరోపించారు. ఆదివారం 34వ వార్డు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో వార్డులోని పలు ఇళ్లకు వెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దార్ల సందీప్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, యువత, రైతులు, చేనేత కార్మికులు సహా వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ ‘బాకీ కార్డుల’ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 34వ వార్డు నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.











