రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం.
అడ్డుకున్న పోలీసులునేతన్న చౌరస్తాలో ఉత్కంఠ.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిరసన కార్యక్రమం కాస్తా పరుగుల పర్వంగా మారడంతో అక్కడి పరిస్థితి ఆసక్తికరంగా మారింది.కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్ ఎంపీ బిమోల్ అకోయిజంను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నేతన్న చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసులు అటూ ఇటూ పరుగులు తీయడంతో నేతన్న చౌరస్తా పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నిరసన కాస్తా పరుగుల పర్వంగా మారడంతో అక్కడి స్థానికులు ఈ పరిణామాలను ఆసక్తిగా తిలకించారు.











