ఉపాధి పనుల వద్దే సద్దుల బతుకమ్మ సంబరాలు.
అక్కపల్లిలో మహిళా కూలీల వినూత్న వేడుకలు!
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పని చేస్తూనే పండుగ సంబరాలను ఆస్వాదిస్తూ మహిళా కూలీలు సందడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలోనే సద్దుల బతుకమ్మను పేర్చి ఆడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా కూలీలంతా వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి పనుల వద్దే బతుకమ్మ వేడుకలు జరుపుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణలో కూలీలు పనులు చేసుకునే సమయంలో జానపద పాటలు పాడుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే అక్కపల్లిలో మహిళా కూలీలు పని ముగిసిన అనంతరం అక్కడే బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో పండుగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా పురుష కూలీలు పని ప్రదేశాన్ని చక్కగా సిద్ధం చేశారు. పనితో పాటు పండుగ ఆనందాన్ని పంచుకున్న కూలీల సంబరాలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.











