విదేశాల్లో చదివితే వేతనంలో వ్యత్యాసమా!
సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలి.
జూనియర్ డాక్టర్ల ఆవేదన.
సిరిసిల్ల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్(శిక్షణ భృతి)తో వైద్య సేవలు ఎలా అందించాలని ప్రశ్నిస్తూ సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 31 మంది జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. సోమవారం ఓపీ విధులను బహిష్కరించి, ఆసుపత్రి ఎదుట ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత జూన్ నుంచి ఇంటర్న్షిప్ విధులు నిర్వహిస్తున్న తమకు నెలకు రూ.5 వేలే చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆమోదిత స్టైపెండ్ రూ.29,792 ఉండగా, కేవలం విదేశాల్లో చదువుకున్నామనే నెపంతో తమకు ప్రభుత్వం శిక్షణభృతి అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఎంబీబీఎస్ ఇంటర్న్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు స్టైపెండ్లో వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. రోజుకు సుమారు రూ.166తో కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం కష్టంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తమకు శిక్షణభృతి చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు ప్రసన్న, వాణిశ్రీ, ద్వారకా సింగ్, హరి, తరుణ్, నితిన్, అభిలాష్, మెర్సి, రమ్య, హౌస్ సర్జన్స్ పాల్గొన్నారు.











