2,400 ఎకరాల స్వాధీనం వివరాలు చెప్పాలని డిమాండ్.
ఆర్టీఐ ద్వారా వివరాలు కోరి, న్యాయపోరాటం చేస్తామని వెల్లడి.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయ్యాయని, వాటిలో 2,400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పందించారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య, బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే 8 వేల ఎకరాలకు సంబంధించిన గ్రామాలు, సర్వే నంబర్లు, భూములు ఎవరికి బదిలీ అయ్యాయి, 2,400 ఎకరాల్లో ఎక్కడెక్కడ భూమిని స్వాధీనం చేసుకున్నారో ప్రజలకు వెల్లడించాలని తోట ఆగయ్య కోరారు. ఈ అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సిరిసిల్ల పర్యటనలోగా భూముల వివరాలను వెల్లడించాలని ముఖ్యమంత్రిని కోరారు. వివరాలు వెల్లడించకపోతే సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ ఛైర్మెన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, సెస్ ఛైర్మెన్ చిక్కాల రామరావు, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, కుంబాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, గుండ్లపల్లి పూర్ణచందర్, చంద్రయ్య, రాజు, స్వాతి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.











