సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం దక్కెదేవరికో..?

త్వరలో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం. కాలికానున్న ఐదు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు..! సిరిసిల్ల పీఠంపైనే అందరి నేతల కన్ను. బడానేతల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : నామినేటెడ్ పదవుల పందేరం మరోసారి కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, పాలకవర్గాలను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో కొత్త నియామకాలపై పార్టీలో చర్చ మొదలైంది.…

త్వరలో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం.

కాలికానున్న ఐదు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు..!

సిరిసిల్ల పీఠంపైనే అందరి నేతల కన్ను.

బడానేతల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : నామినేటెడ్ పదవుల పందేరం మరోసారి కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, పాలకవర్గాలను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో కొత్త నియామకాలపై పార్టీలో చర్చ మొదలైంది. అతి త్వరలో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేటతో పాటు వీర్నపల్లి మార్కెట్ కమిటీల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఐదు నామినేటెడ్ చైర్మన్ పోస్టులు ఖాళీకానున్నాయి. కొత్త చైర్మన్ పదవుల కోసం ఆశావాహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

సిరిసిల్ల పీఠంపైనే అందరి చూపు.

నియోజకవర్గంలో ఐదు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఖాళీ కానున్నప్పటికీ.. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి మాత్రం విపరీతమైన డిమాండ్ నెలకొంది. జిల్లా కేంద్రంలోని కీలక మార్కెట్ కమిటీ కావడంతో ఈ పదవిని దక్కించుకుంటే రాజకీయంగా మంచి గుర్తింపు లభిస్తుందనే భావన ఆశావాహుల్లో కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు నేతలు తమకు అనుకూలంగా ఉన్న ముఖ్య నాయకుల వద్దకు వెళ్లి తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరి బలం ఎంత..? ఎవరికి అధిష్టానం వద్ద పలుకుబడి ఉంది..? ఎవరికి కార్యకర్తల మద్దతు ఉంది..? ఎవరికి రైతులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..? అనే అంశాలపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

సిరిసిల్ల మార్కెట్ కమిటీకి ఆశావాహుల జోరు.

సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం చాలామంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అది జనరల్ స్థానం కావడంతో సిరిసిల్ల రూలర్, టౌన్, తంగళ్లపల్లి మండలం నుంచి దాదాపు 20 మంది ఆశావాహులు ఛైర్మెన్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో సిరిసిల్ల పట్టణానికి చెందిన గోలి వెంకటరమణ, పెద్దూరుకు చెందిన చెన్నమనేని కమలాకర్ రావు, సత్తు శ్రీనివాసరెడ్డి, లింగాల భూపతి, ఆకునూరి బాలరాజు, కూతురు వెంకటరెడ్డి, జూపల్లి రాజేశ్వరరావు, మహిళా విభాగానికి సంబంధించి కల్లూరి చందన, ముడుపు శ్రీదేవిలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. వీరితోపాటు తంగళ్ళపల్లి మండలానికి చెందిన వైద్య శివప్రసాద్, పూర్మాణి లింగారెడ్డిలు కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. కాగా వీరిద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న క్రమంలో అధిష్టానం కూడా వీరి పేర్ల పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ తమదైన రాజకీయ నేపథ్యం ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఒకరి బలం పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం అయితే.. మరొకరి బలం సామాజిక సంబంధాలు, ఆర్థికంగా బలమైన నేపథ్యం, బలం, కుటుంబ రాజకీయ నేపథ్యం, స్థానిక పరిచయాలు అన్న చర్చ నడుస్తోంది.

‘నలభై ఏళ్ల’ రాజకీయ ప్రస్థానం.. అయినా పదవి దక్కలేదే..!

ఈ రేసులో వైద్య శివప్రసాద్ పేరు బలంగా వినిపిస్తుండటానికి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసిన ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. మధ్యలో కొంతకాలం ఒత్తిడిల వల్ల బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ తిరిగి కాంగ్రెస్‌లో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మహేందర్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో కలివిడిగా ఉండటం.. ప్రభుత్వంలోని పలువురు ముఖ్య నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా దక్కకపోవడం ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మారుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

లింగారెడ్డి.. మళ్లీ యాక్టివ్..!

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన పూర్మాణి లింగారెడ్డి పేరు కూడా చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. కేబుల్ ఛానల్ భాగస్వామిగా ఉన్న ఆయన కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయన భార్య మంజుల గతంలో జెడ్పీటీసీగా రెండు పర్యాయాలు పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అయితే కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న లింగారెడ్డి.. ఇటీవల మళ్లీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు.
దీంతో ఆయన కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాగా లింగారెడ్డి పార్టీలో చేరిన సమయంలోనే అధిష్టానం తనకు నామీనేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఒక తంగళ్ళపల్లి మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉన్న వ్యక్తి కావడం ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ఇద్దరు నేతలు.. ఒక్కటే పదవి..

అయితే ఇద్దరు నేతలు.. రెండు రకాల రాజకీయ నేపథ్యాలు.. ఒక్కటే పదవి. దీంతో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఆసక్తి మరింత పెరిగింది.
ఒకవైపు సుదీర్ఘ పార్టీ అనుభవం.. మరోవైపు స్థానికంగా ఉన్న పరిచయాలు, రాజకీయ నేపథ్యం.. ఇలా ఇద్దరు తమదైన బలంతో రేసులో నిలిచారు. కాగా చివరి నిర్ణయం మాత్రం అధిష్టానానిదే. స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీ విధేయత, నాయకులు–కార్యకర్తలతో సంబంధాలు, రైతులతో అనుబంధం, గతంలో పార్టీ కోసం చేసిన కృషి వంటి అంశాలు కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

రైతు పక్షాన నిలిచే నేతకే పట్టం..?

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావడంతో రైతులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. కేవలం రాజకీయ పలుకుబడిని కాకుండా.. పార్టీ కోసం కష్టపడిన తీరు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, రైతుల సమస్యలపై అవగాహన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
పదవీకాలం ముగిసే తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆశావాహుల లాబీయింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇద్దరు నేతల్లో ఎవరి పేరు ఖరారవుతుంది..?
సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం ఎవరికి దక్కుతుంది..? చివరి మలుపులో ఎవరి రాజకీయ చక్రం తిరుగుతుంది..?
దీనికి సమాధానం అధిష్టానం నిర్ణయంతోనే తేలనుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!