సీఎం హోదాలో వస్తున్న రేవంత్.. హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి: బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
8 వేల ఎకరాల ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కొండూరు రవీందర్రావు.
సిరివెలుగు, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సోమవారం పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రజల గుండెల్లో కేటీఆర్ ఉన్నారని, సిరిసిల్ల అభివృద్ధి ఎలా జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల సమయంలో సిరిసిల్లకు వచ్చిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వస్తున్నందున, ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం రికవరీ చేసిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని పేర్కొన్నారని, ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి నిరూపించాలని ఆగయ్య డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించలేకపోతే సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇదే అంశంపై కేటీఆర్ కూడా భూముల వివరాలు, సర్వే నంబర్లు, రికవరీ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని, నేతన్నలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని ఆగయ్య కోరారు. ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్లకు వస్తున్న రేవంత్రెడ్డి రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర ఎన్నికల హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సిరిసిల్ల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్కు చెందిన 27 మంది మున్సిపల్ కౌన్సిలర్లను ప్రజలు గెలిపించారని, కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్ల వార్డుల్లో జరిగిన అభివృద్ధిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కార్మికులతో పాటు రైతుల సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మల్కపేట రిజర్వాయర్ను పూర్తి చేసి, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించే అవకాశం కల్పించామని, మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుబంధు సాయం, రైతుబీమా కొనసాగింపు, బీమా ప్రీమియం చెల్లించి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మధ్య మానేరు ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన రవీందర్రావు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశారని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మధ్యమానేరు తెలంగాణకు కీలకమైన ప్రాజెక్టు అని, ఇక్కడి నుంచి మల్లన్నసాగర్కు నీటిని తరలిస్తున్నామని పేర్కొంటూ.. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, న్యాలకొండ రాఘవరెడ్డి, కంబాల మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, జక్కుల నాగరాజు యాదవ్, కౌన్సిలర్లు, మధ్యమానేరు గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.











