538 మందికి వైద్య పరీక్షలు.. 56 మందికి శస్త్రచికిత్సల కోసం రిఫర్.
డాక్టర్ చెన్నమనేని దీప, వికాస్ చేతుల మీదుగా శిబిరం ప్రారంభం.
సిరివెలుగు, వేములవాడ: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్, కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి ఆధ్వర్యంలో చందుర్తి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నమనేని దీప, డాక్టర్ చెన్నమనేని వికాస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 538 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య నిపుణులు తగిన సలహాలు, సూచనలు అందించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె, కాలేయం, శ్వాసకోశ సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరీక్షించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, చిన్నపిల్లల వైద్యం, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కంటి వైద్యం, క్యాన్సర్ విభాగాలకు చెందిన వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలతో పాటు ఎక్స్రే, రక్తంలో చక్కెర స్థాయుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించేందుకు మమ్మోగ్రఫీ, గర్భాశయ ముఖద్వార సంబంధిత సమస్యలను గుర్తించేందుకు కాల్పోస్కోపీ పరీక్షలు కూడా అందించారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్సలు అవసరమైన 56 మందిని తదుపరి చికిత్సల కోసం కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడంలో ఇలాంటి శిబిరాలు కీలకంగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగల్ సర్పంచ్ అసినిపర్తి శోభారాణి సుధాకర్, ఉప సర్పంచ్ మ్యాకల జలంధర్, బండపల్లి సర్పంచ్ కట్కం మల్లేశం, బీజేపీ నాయకులు అల్లడి రమేష్, మార్త సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, మోకిలే విజేందర్, పెరిక గంగరాజు, చిర్రం తిరుపతి, చింతకుంట సాగర్, పెరిక రంజిత్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రతిమ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











