అనుమతుల మాటున అక్రమ మట్టి రవాణా?
ఆయా శాఖల పర్యవేక్షణపై ప్రశ్నలు!
రాజకీయ అండతో సహజ సంపదకు గండి?
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు!
చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్!
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట.. ఇదేనా అధికారుల పర్యవేక్షణ.. అనుమతుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు.. రవాణా జరుగుతున్నాయన్న ఆరోపణలు జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సహజ సంపదను వెలికితీసేందుకు సంబంధిత శాఖలు జారీ చేస్తున్న అనుమతులు ఏ ప్రాంతానికి వర్తిస్తున్నాయి.. వాస్తవంగా తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి… అనుమతుల పరిధిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారా… అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
అనుమతుల మాటున అక్రమ మట్టి రవాణా?
మండల వ్యాప్తంగా అనుమతుల మాటున అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతుందని చర్చ కొనసాగుతోంది. మండలంలోని ఓ గ్రామంలోని ఒక సర్వే నెంబరులో మట్టి తవ్వకాలకు రెవెన్యూ డివిజనల్ అధికారి అనుమతులు ఇచ్చారు. చెరువులు, కుంటల వాటి పునరుద్ధరణలో భాగంగా ఈ అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారి ఇచ్చిన అనుమతుల్లో అసలు అక్కడ కుంట అనేది లేదని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు ఇచ్చిన సర్వే నెంబరు కాకుండా మరో సర్వే నెంబర్ లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శలు వినబడుతున్నాయి. అంతేకాకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్న భూమిని ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల కోసం కేటాయించినట్లు సమాచారం. ఈ మట్టి తవ్వకాలకు గ్రామపంచాయతీ నుండి అనుమతులు ఇవ్వడం గమనార్హం. రాజకీయ అండతోనే సహజ సంపదకు గండి కొడుతూ, మండలంలో మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అనుమతులు ప్రభుత్వ పనులకు ఇచ్చినప్పటికీ ఏ ప్రాంతంలో ఇచ్చామన్నది ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు!
ఇలా మండలంలో మట్టి దందా కొనసాగుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్డిఓ అనుమతులు ఇచ్చిన కుంట అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోనే లేనట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇంకా భూగర్భ, గనుల శాఖ నుండి కూడా ఎలాంటి అనుమతులు పొందలేదని సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరుగుతున్న మట్టి తవ్వకాలను నిలిపి, చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.











