ప్రభుత్వమే అధికారికంగా వారోత్సవాలు నిర్వహించాలి.
చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.
సిరివెలుగు, సిరిసిల్ల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాలో వారం రోజులుగా నిర్వహించిన వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో చరిత్రపై అవగాహన కల్పించామని తెలిపారు. బుధవారం సిరిసిల్లలోని సుభాష్నగర్ సీపీఐ కార్మిక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ కార్యదర్శి పంతం రవి, నియోజకవర్గ బాధ్యులు గుంటి వేణు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. సిరిసిల్లలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, కామ్రేడ్ సింగిరెడ్డి భూపతిరెడ్డి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతాంగ సాయుధ పోరాటాన్ని వివిధ రాజకీయ వర్గాలు భిన్నంగా వివరిస్తున్నాయని పేర్కొంటూ, తమ దృష్టిలో ఇది వెట్టిచాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటమని నాయకులు వివరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల తరహాలోనే హైదరాబాద్లో జరిగే ముగింపు బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.కార్యక్రమంలో నాయకులు మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు, విద్యార్థి సంఘం నాయకులు రాకేష్, సదానందం తదితరులు పాల్గొన్నారు.











