సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని పోలీసులకు సూచన.
బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశం.
సిరివెలుగు, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, పిటిషన్లో పేర్కొన్న బాధితులకు రక్షణ కల్పించాలని సూచించింది. కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేష్ ముదిరాజ్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ భవనం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి నమోదు చేయాల్సిన కేసుల విషయంలో కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. మరోవైపు, దాడి జరిగిందని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఘటనలో మారణాయుధాలు ఉపయోగించారని వారు పేర్కొనగా, దుండగుల వద్ద కత్తులు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. గతంలో ఘటనపై ఎలాంటి దాడి జరగలేదని డీసీపీ శిల్పవల్లి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీజే అనుమతులు ఆన్లైన్లో పొందే అవకాశం ఉన్నందున, ఇందుకోసం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఘటన జరిగిన రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. బాధితులకు రక్షణ కల్పించాలని కూడా సూచించింది.











