సిరివెలుగు, సిరిసిల్ల: విద్యార్థులు మంచిగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదిగి, ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన మంచాలు, బెడ్స్ను ఆమె ప్రారంభించారు. జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు బ్యాంకు ఆధ్వర్యంలో మొత్తం 150 మంచాలు, బెడ్స్ అందించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులు, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. పాఠశాలల్లో వసతులు, భోజనం తదితర అంశాలను పరిశీలించేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు వారి పుట్టిన ప్రాంతం, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులు కావని, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.

సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలని, పెద్దలను గౌరవిస్తూ విలువలతో కూడిన విద్యార్థులుగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగం లేదా స్వయం ఉపాధిలో స్థిరపడి సమాజానికి తిరిగి సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, జీసీడీఓ పద్మజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. రాజీవ్ కుమార్, బ్యాంక్ చీఫ్ మేనేజర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











