6 గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
పాత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తుల ఉమా విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటి అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సిరిసిల్లలో పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తుల ఉమా మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నమ్మిన ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












