ఐడీఓసీలో 172 దరఖాస్తులు.. ఆర్డీఓ కార్యాలయాల్లో 18.
మండలాల నుంచి 59 అర్జీలు.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణికి 172 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో 8, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 10 దరఖాస్తులు స్వీకరించారు.
మండలాల్లోనూ ప్రజావాణి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 59 దరఖాస్తులు స్వీకరించారు.బోయినపల్లి 3, చందుర్తి 3, ఇల్లంతకుంట 4, గంభీరావుపేట 5, కోనరావుపేట 2, ముస్తాబాద్ 16, రుద్రంగి 1, తంగళ్లపల్లి 3, వీర్నపల్లి 5, వేములవాడ అర్బన్ 3, వేములవాడ రూరల్ 11, ఎల్లారెడ్డిపేట 3 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
ఐడీఓసీతో పాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానికంగా తమ సమస్యలపై అర్జీలను సమర్పించాలని, అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.











