తొలి ‘చాంద్ సితారె’ బాల సాహిత్య పురస్కారం ప్రదానం.
ఖమ్మంలో ఘన సత్కారం.. 40 నిమిషాల పాటు కొనసాగిన అభినందన సభ.
సిరివెలుగు సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహిత్య వికాస కార్యకర్త, రంగినేని పిల్లల పండుగ కన్వీనర్ గరిపెల్లి అశోక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం చాంద్ సితారె సంస్థ తొలి బాల సాహిత్య పురస్కారం ‘చాంద్ సితారె–2026’ ను ఆయనకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. ఖమ్మంలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి చాంద్ సితారె సంస్థ అధ్యక్షుడు, బాల వికాసకారుడు షఫీ అధ్యక్షత వహించగా, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వురిమళ్ల సునంద, నామా పురుషోత్తం, కట్టా శేఖర్‌రావు, బోళ్ళ వీరబ్రహ్మం, కన్నెగంటి వెంకటయ్య, పోతగాని సత్యనారాయణ, బండి ఉష, కొమ్మవరపు కృష్ణయ్యలు అతిథులుగా హాజరయ్యారు.
బాల సాహిత్యానికి విశేష సేవలు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు షఫీ మాట్లాడుతూ తెలంగాణలో బాల సాహిత్య వికాసోద్యమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్న సిరిసిల్లకు చెందిన గరిపెల్లి అశోక్, పత్తిపాక మోహన్ ద్వయంలో అశోక్‌కు తొలి ‘చాంద్ సితారె’ పురస్కారం అందించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో బాల సాహిత్య వికాసానికి గరిపెల్లి అశోక్ అందిస్తున్న సేవలు విలువైనవని అతిథులు కొనియాడారు. అనంతరం శాలువా, పూలమాల, ప్రశంసాపత్రంతో ఆయనను ఘనంగా సత్కరించారు.
అభిమానానికి నిదర్శనంగా ఘన సత్కారం.
గరిపెల్లి అశోక్‌పై ఉన్న అభిమానంతో కార్యక్రమానికి హాజరైన అతిథులు, బాల సాహితీవేత్తలు పెద్దఎత్తున సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగడం ప్రత్యేకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన పలువురు బాల సాహితీవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిరిసిల్ల కవులు, రచయితల అభినందనలు.
గరిపెల్లి అశోక్‌కు ‘చాంద్ సితారె–2026’ పురస్కారం లభించడంపై సిరిసిల్లకు చెందిన కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు. జూకంటి జగన్నాథం, పత్తిపాక మోహన్, ఆడెపు లక్ష్మణ్, టీవీ నారాయణ, ఎలగొండ రవి, భూమేష్, అంకారపు రవి, బూర దేవానందం, దూరం గణేష్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.











