భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు. రైతులకు పరిహారం త్వరగా అందించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస ప్యాకేజీ (ఆర్‌అండ్‌ఆర్‌) పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిపై సోమవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌…

2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు.

రైతులకు పరిహారం త్వరగా అందించాలి.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస ప్యాకేజీ (ఆర్‌అండ్‌ఆర్‌) పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిపై సోమవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.

రూ.6 వేల కోట్ల వరకు నిధులు.

2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.2,550 కోట్లను పూర్తిస్థాయిలో వినియోగించిన అనంతరం అవసరాన్ని బట్టి అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
భూసేకరణ పరిహారాన్ని నిర్వాసితులకు త్వరితగతిన అందించాలని, ప్రత్యేక అధికారులను నియమించి పనులకు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు.
నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులను తొలి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు సంబంధించి సుమారు రూ.3,100 కోట్ల విలువైన పనులను గుర్తించగా, రూ.2,514 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. పరిహారం నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, ఆర్డీఓలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి దయాకర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌–2026పై ప్రత్యేక దృష్టి.

ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియలో రానున్న 30 నుంచి 40 రోజులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ పాల్గొన్నారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సీఈఓ సూచించారు. అవసరమైన చోట నోటీసులు జారీ చేసి, విచారణ అనంతరం దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలు కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అక్టోబర్‌ చివరి వారంలోగా అనామలీస్‌, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించి ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులు, వాటి పరిష్కార ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు.

అక్టోబర్‌ 25లోగా పూర్తి చేయాలి.

ఎస్‌ఐఆర్‌–2026కు సంబంధించిన అన్ని పనులను అక్టోబర్‌ 25, 2026లోగా పూర్తి చేయాలని సీఈఓ స్పష్టం చేశారు. చివరి పది రోజులను అవసరమైన సవరణలు, ఇతర తుది ప్రక్రియలకు వినియోగించుకోవాలని సూచించారు. ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్‌ ఫారాన్ని తప్పనిసరిగా అందజేయాలని, ఓటర్లకు జారీ చేసే నోటీసులను బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత ఓటర్లు, వారి కుటుంబ సభ్యులకు బీఎల్‌ఓలు తెలియజేయాలని సూచించారు. బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించి, తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీఈఓ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫారం-6, 7, 8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో జయశ్రీ, ఆర్డీఓలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, తహసీల్దార్లు మహేష్‌, జయంత్‌, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌, ఎలక్షన్‌ సెక్షన్‌ అధికారి రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!