స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు పోరాటం.
బాపూజీ ఆశయాలను కొనసాగించాలి.
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపు.
సిరివెలుగు, సిరిసిల్ల :తెలంగాణ కోసం, సమాజం కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. సోమవారం కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బాపూజీ తనదైన పాత్ర పోషించారని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులకు తన అనుభవంతో సూచనలు, సలహాలు అందిస్తూ మార్గదర్శకంగా నిలిచారన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులోనూ కొండ లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. పద్మశాలీల సమస్యల పరిష్కారం కోసం పోరాడటంతో పాటు ఆ సామాజిక వర్గం ఐక్యతకు ఆయన విశేష కృషి చేశారన్నారు. బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిందం కళా చక్రపాణి పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘం ప్రతినిధులు, పద్మశాలిలు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.











