తొలి 1,000 రోజులు అత్యంత కీలకం.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పిల్లల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం ఎంతో కీలకమని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం అన్నారు. గురువారం జాతీయ పోషణ మాసం సందర్భంగా సిరిసిల్లలోని కల్యాణలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ మేళా కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, ఏఎంసీ చైర్మన్లు, సిడిపిఓ సబిత, ఇతర అధికారులతో కలిసి ఆయన జ్యోతి ప్రొద్దున చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశువు పుట్టిన నాటి నుంచి తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ కాలంలో తల్లులు, చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి, అవసరమైన సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారుల్లో తీవ్ర, మధ్యస్థ పోషకాహార లోపం, సూక్ష్మ పోషకాలు, చిరుతిళ్లకు దూరంగా ఉండటం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారంపై తల్లిదండ్రులకు వివరించారు. పోషణ మేళాలో పోషకాహారంతో కూడిన వివిధ ఆహార పదార్థాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు, వైద్యాధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.











