చట్టాలపై అవగాహనతోనే హక్కులను కాపాడుకోగలం.
సిరివెలుగు, సిరిసిల్ల: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికీ సులభంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు తెలిపారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడెపు వేణు మాట్లాడుతూ ప్రతి పౌరుడికి న్యాయ అవగాహన అవసరమని, చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే వ్యక్తి తన హక్కులను సమర్థవంతంగా కాపాడుకోగలరన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, బలహీన వర్గాల ప్రజలు తమ హక్కులను వినియోగించుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాల మేరకు, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి.లక్ష్మణాచారి సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యుడు గుర్రం ఆంజనేయులు, న్యాయవాదులు బూర మధుసూదన్, కోనేటి నరేష్, ఎస్ఐ లక్ష్మణ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











