మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో సిరిసిల్ల పోక్సో కోర్టు సంచలన తీర్పు.
19 మంది సాక్షులను విచారించిన కోర్టు.
దర్యాప్తు, ప్రాసిక్యూషన్ బృందాన్ని అభినందించిన ఎస్పీ.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసులో సిరిసిల్ల పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో శుక్రవారం పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
19 మంది సాక్షుల విచారణ.
ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని మైనర్ బాలికపై మధ్యప్రదేశ్కు చెందిన చతుర్ సింగ్ మున్నా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. అనంతరం అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.కేసు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో 19 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువైనట్లు నిర్ధారించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం.
మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురిచేసినా, అన్యాయం జరిగినా బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పోలీసు బృందానికి అభినందనలు.
కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అప్పటి, ప్రస్తుత సిరిసిల్ల డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రచారి, అప్పటి, ప్రస్తుత సీఐలు బన్సీలాల్, వెంకటేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రవణ్ యాదవ్, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమేష్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల, భరోసా సెంటర్ లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.











