సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పోరాటం కమ్యూనిస్టులదైతే ఆరాటం బీజేపీదని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. స్కైలాబ్బాబు విమర్శించారు. పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులన్నారు. గురువారం సిరిసిల్లలో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ 1946–51 మధ్య జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని తెలిపారు.

ఈ పోరాటాన్ని మతపరమైన కోణంలో కాకుండా భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన వర్గ పోరాటంగా చూడాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలకు చెందిన వారు పోరాడారని పేర్కొంటూ, చరిత్రను మతపరమైన ఘర్షణగా చిత్రీకరించవద్దన్నారు. పోరాట చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద సాయుధ పోరాట అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించి, అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్తో పాటు పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.











