వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రతో అపూర్వ పట్టుచీర.
102 మంది ఋషుల పేర్లు.. 102 గోత్రనామాలు.. 25 చారిత్రక చిత్రాలు.
45 రోజుల శ్రమతో చేనేత మగ్గంపై ఆధ్యాత్మిక కళాఖండం.
సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: చేనేత మగ్గంపై దారం మాత్రమే కాదు.. చరిత్రను కూడా నేయవచ్చని మరోసారి నిరూపించారు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్. మగ్గంపై తనదైన సృజనాత్మకతతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న ఆయన.. తాజాగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను ఓ పట్టుచీరపై అద్భుతంగా ఆవిష్కరించి మరో విశిష్ట కళాఖండాన్ని సృష్టించారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి–కోటేశ్వరరా వు ఇచ్చిన ప్రత్యేక ఆర్డర్ మేరకు దాదాపు 45 రోజులపాటు నిరంతరంగా శ్రమించి ఈ అపూర్వ పట్టుచీరను రూపొందించారు. ఇందులో 102 మంది ఋషుల పేర్లు, 102 గోత్రనామాలు, అమ్మవారి దివ్య చరిత్రను ప్రతిబింబించే 25 చారిత్రక చిత్రాలను అత్యంత సూక్ష్మంగా మగ్గంపై నేశారు.
అక్షరమూ కళే.. చిత్రమూ కళే..

ఒక్కో అక్షరం.. ఒక్కో గోత్రనామం.. ఒక్కో చారిత్రక చిత్రం.. ఇలా ప్రతి అంశాన్ని మగ్గంపై నేయడం వెనుక అపారమైన ఓర్పు, ఏకాగ్రత, సాంకేతిక నైపుణ్యం అవసరం. హరి ప్రసాద్ తన చేనేత నైపుణ్యంతో వీటన్నింటినీ పట్టుదారంలో ఒదిగేలా మలిచారు. సుమారు 7 మీటర్ల పొడవు కలిగిన ఈ పట్టుచీరను పూర్తిగా పట్టుదారంతో పాటు 2 గ్రాముల బంగారు జరి ఉపయోగించి రూపొందించారు. చీరను పరిశీలిస్తే భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, చేనేత కళా నైపుణ్యం ఒకే చోట కలిసిన అనుభూతి కలుగుతుంది.
అగ్గిపెట్టెలో చీర నుంచి.. చరిత్రను మోసే చీర వరకు.
చేనేత మగ్గంపై వినూత్న ప్రయోగాలకు హరి ప్రసాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కేవలం 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను మగ్గంపై నేసి తన ప్రతిభను చాటుకున్నారు. అదే కళాకారుడు ఇప్పుడు వేగానికి భిన్నంగా ఓర్పు, ఏకాగ్రత, సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ 45 రోజులపాటు శ్రమించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్రను ఒకే పట్టుచీరపై ఆవిష్కరించారు.
చరిత్రను చదవడమే కాదు..
చీరగా నేయడం!

సాధారణంగా చీరను నేయడం ఓ కళ. కానీ చరిత్రను చిత్రాలుగా.. గోత్రాలను అక్షరాలుగా.. ఋషుల పేర్లను డిజైన్లుగా.. ఆధ్యాత్మిక భావనలను పట్టుదారంగా మార్చడం మాత్రం అత్యంత అరుదైన సృజన. భావితరాలకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను ఓ ప్రత్యేక కళారూపంలో అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ చీర.. కేవలం వస్త్రం కాదు. భక్తి, వారసత్వం, చరిత్ర, చేనేత నైపుణ్యాల సంగమంగా నిలిచే ఓ కళాఖండం.
మగ్గంపై మూడు తరాల స్ఫూర్తి.
వాసవి కన్యకా పరమేశ్వరి.. 102 ఋషులు.. 102 గోత్రాలు.. 25 చారిత్రక చిత్రాలు.. 45 రోజుల శ్రమ.. పట్టుదారం.. బంగారు జరి.. ఇవన్నీ ఒకే చీరలో ఒదిగాయి. సిరిసిల్ల చేనేతకు సృజనాత్మకతను జోడిస్తూ ముందుకు సాగుతున్న వెల్ది హరి ప్రసాద్.. తన గత రికార్డులకే పరిమితం కాకుండా, ప్రతి కొత్త ప్రయోగంతో మగ్గం ఒక కళాసాధనకు వేదికగా మారగలదని నిరూపిస్తున్నారు.











