27 రోజుల నక్షత్ర దీక్ష పూర్తి
వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు.
సిరివెలుగు, హనుమకొండ: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 27 రోజుల నక్షత్ర దీక్షను పూర్తి చేసి నక్షత్ర మాల విరమణ చేశారు. ఇరుముడితో కొత్తకొండ కొండపైకి చేరుకున్న మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో నక్షత్ర మాల విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. 27 రోజుల దీక్షను పూర్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మంత్రిని కలిసి అభినందించారు.












