సిరిసిల్ల జేఎన్‌టీయూ క్యాంపస్‌కు మోక్షమెప్పుడు?

విద్యార్థుల సమస్యలపై సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి. శాశ్వత భవన నిర్మాణంలో జాప్యంపై ఆవేదన. క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించాలని డిమాండ్‌. సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్‌ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదేళ్లుగా…

విద్యార్థుల సమస్యలపై సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి.

శాశ్వత భవన నిర్మాణంలో జాప్యంపై ఆవేదన.

క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించాలని డిమాండ్‌.

సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్‌ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఐదేళ్లుగా పెండింగ్‌లో నిర్మాణం!

2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినా నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత ప్రాంగణం నుంచి కళాశాలను మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు నిరుపయోగంగా మారకుండా చూడాలని సూచించారు.

క్యాంపస్‌ నిర్మాణం చేపట్టాలి.

మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులను వేగవంతం చేయాలని కేటీఆర్‌ కోరారు. కొత్త క్యాంపస్‌ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ప్రస్తుత ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజన్న సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఈ కళాశాల కీలక పాత్ర పోషిస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!