కాంగ్రెస్ అధిష్టానం నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి

సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు స్వాగతం. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గుడ్ల జ్యోతికిరణ్ ప్రకటన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: “పద్మశాలి బిడ్డకే ఎమ్మెల్సీ” అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నానని సిరిసిల్లకు చెందిన ప్రముఖ హై కోర్టు న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారిణి గుడ్ల జ్యోతి కిరణ్ తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి తనకు తగిన అర్హతలు ఉన్నాయని పేర్కొంటూ, తన అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ ముఖ్య…

సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు స్వాగతం.

సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గుడ్ల జ్యోతికిరణ్ ప్రకటన.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: “పద్మశాలి బిడ్డకే ఎమ్మెల్సీ” అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నానని సిరిసిల్లకు చెందిన ప్రముఖ హై కోర్టు న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారిణి గుడ్ల జ్యోతి కిరణ్ తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి తనకు తగిన అర్హతలు ఉన్నాయని పేర్కొంటూ, తన అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిసిల్ల ప్రాంతంలో స్థానిక పద్మశాలి మహిళకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలన్న అంశం తనలో ప్రజాసేవ చేయాలనే స్ఫూర్తిని మరింత పెంచిందన్నారు. తన అభ్యర్థిత్వం వ్యక్తిగత స్వార్థం కోసం కాదని, శాసన మండలిలో పద్మశాలీలతో పాటు బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నట్లు తెలిపారు.

38 ఏళ్ల న్యాయవాద వృత్తి అనుభవం.

తాను బీసీ-బి (పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన మహిళనని, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ విద్యను అభ్యసించానని జ్యోతి కిరణ్ తెలిపారు. దాదాపు 38 సంవత్సరాల న్యాయవాద వృత్తి అనుభవం ఉందని, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేసి న్యాయవాద వృత్తిలో శిక్షణ పొందినట్లు చెప్పారు. హైకోర్టులో ఏపీఎస్‌ఆర్టీసీ, ఎంసీహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ వంటి ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా, ఎనిమిదేళ్లపాటు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసినట్లు వివరించారు. పేదలకు అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.

తెలంగాణ ఉద్యమంలో తాను చురుకుగా పాల్గొన్నానని జ్యోతి కిరణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీని అనుసరించి పలు సభలు, సమావేశాల్లో పాల్గొన్నానని తెలిపారు. 2009 నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ కో-కన్వీనర్‌గా పనిచేశానని, జేఏసీలను సమన్వయం చేసే కోఆర్డినేట్ కమిటీ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు రావాల్సిన వాటా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, 42 శాతం తెలంగాణ వాటా సాధన కోసం పోరాడినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్టయిన ఉస్మానియా విద్యార్థులు, ఉద్యోగులకు ఉచిత న్యాయ సహాయం అందించి బెయిల్ ఇప్పించానని చెప్పారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యురాలిగా పనిచేసినట్లు వివరించారు.

నాది కాంగ్రెస్ కుటుంబమే.

తన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉందని ఆమె తెలిపారు. తన తండ్రి దివంగత గుడ్ల లక్ష్మీనర్సయ్య స్వాతంత్ర్య సమరయోధుడని, 1947-48లో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. 1962లో సిరిసిల్ల అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, సొంత స్థలంలో సొంత ఖర్చులతో సిరిసిల్ల తాలూకా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పార్టీ విస్తరణకు కృషి చేశారని వివరించారు. ఇలాంటి కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలు, బీసీల అంశాలు, న్యాయపరమైన విషయాలను శాసన మండలిలో బలంగా ప్రస్తావిస్తానని జ్యోతి కిరణ్ తెలిపారు. కాగా ఇటీవల సిరిసిల్లలో జరిగిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్‌రెడ్డి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!