సిబ్బంది తీరుపై పలు అవకతవకలు గుర్తింపు.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించారు. తనిఖీల్లో ఎంవీఐ అందుబాటులో లేని సమయంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎన్. గిరీష్ కుమార్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడం, వాహనాల రిజిస్ట్రేషన్ తనిఖీలు చేయడం గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అలాగే, ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నట్లు, ఏజెంట్లకు కార్యాలయంలో స్వేచ్ఛగా ప్రవేశం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ లోపించడం కూడా గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. డ్రైవింగ్ పరీక్ష నిర్వహించే ప్రదేశం రవాణా శాఖ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం, డ్రైవింగ్ ట్రాక్ వద్ద సూచిక బోర్డులు లేకపోవడం వంటి లోపాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది. ఎవరైనా అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు.











