సిరిసిల్ల ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఘటన.
ఆందోళనలో భాధిత కుటుంబం.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఎడమ కంటికి సర్జరీ చేయాల్సిన ఓ వృద్దురాలికి కుడి కంటికి సర్జరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఎంకమ్మ అనే వృద్దురాలికి ఎడమ కంటికి సర్జరీ చూపు సమస్య ఉండటంతో ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి, అనంతరం ఎడమ కంటికి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. అయితే సోమవారం సర్జరీ అనంతరం ఎంకమ్మను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకురాగా కుడి కంటికి సర్జరీ జరిగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సర్జరీకి ముందే ఏ కంటికి చికిత్స చేయాలనే విషయం నిర్ధారించినప్పటికీ కుడి కంటికి సర్జరీ జరగడంతో అవాక్కయ్యారు. ఇప్పుడు ఈ సర్జరీ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సర్జరీకి ముందు రోగి వివరాలు, ఆపరేషన్ చేయాల్సిన కంటిని వైద్య బృందం ఏ విధంగా నిర్ధారించిందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించాలని బాధిత కుటుంబం కోరుతోంది. సంబంధిత అధికారులు ఘటనపై సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.











