
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి.
డీజేలకు అనుమతి లేదని స్పష్టం.
సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, కౌన్సిలర్లతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి గణేష్ మండపాన్ని గణేష్ పోర్టల్–2026లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజా రవాణా, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద 24 గంటలూ వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మండపాలను జియో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. విగ్రహం 10 అడుగులకు మించి ఎత్తు ఉంటే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నిమజ్జనం రోజున నిర్దేశించిన మార్గంలో, నిర్ణీత సమయానికి నిమజ్జన ప్రదేశానికి చేరుకోవాలని, మానేరు తీరంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా తగినన్ని క్రేన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
డీజేలకు నో.
మండపాలు, శోభాయాత్ర, నిమజ్జనం సమయంలో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజేలు వినియోగిస్తే నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాత్రి 10 గంటల వరకు రెండు చిన్న స్పీకర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు చేసే వారిపై, వాస్తవాలు తెలుసుకోకుండా వాటిని ఫార్వర్డ్ చేసే వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత నిమజ్జనం సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలపై 8 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలను మండపాల వద్ద అనుమతించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కూడా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.











