ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. విద్యార్థులకు జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే దిశానిర్దేశం

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉంటూ..రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సూచించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన వంద రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి విద్యా సంవత్సరంలో వంద రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం అభినందనీయమని…

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉంటూ..రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచన.

సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సూచించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన వంద రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి విద్యా సంవత్సరంలో వంద రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు దేశం పట్ల గౌరవం, బాధ్యతను పెంచుతాయని తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. మైనర్ల వాహనదారిత్వం, ముగ్గురు ప్రయాణించడం, తప్పుడు మార్గంలో వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు తాము నిబంధనలు పాటించడంతో పాటు ఇతరులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అన్నారు.సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. నకిలీ ఖాతాలు, అనుమానాస్పద లింకులు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, ఉపకార వేతనాలు, బహుమతులు, లక్కీ డ్రాల పేరుతో సైబర్‌ మోసాలు జరుగుతున్నాయని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సాయికిరణ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌ రఘునందన్‌, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!