ఆది శ్రీనివాస్తో పోటాపోటీగా కబడ్డీ.
క్రీడాకారుల్లో జోష్.. ప్రేక్షకుల్లో ఈలల మోత.
సిరివెలుగు, వేములవాడ: వేములవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ఆసక్తికరంగా మారాయి. సోమవారం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం బరిలోకి దిగడంతో ఒక్కసారిగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా కూతకు వస్తుండగా మంత్రి పొన్నం ఆయనను పట్టుకుని అవుట్ చేసేందుకు ప్రయత్నం చేయగా మంత్రి పొన్నం కూతకు వెళ్ళినప్పుడు ఆది శ్రీనివాస్ పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ సరదాగా పోటాపోటీగా కబడ్డీ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.మంత్రి పొన్నం కబడ్డీ ఆడుతున్న దృశ్యాలను చూసిన ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, కేకలతో ఉత్సాహపరిచారు. కాసేపు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రేక్షకులు అన్న తేడా లేకుండా కబడ్డీ మైదానం సందడిగా మారింది. మంత్రి క్రీడాకారులతో కలిసి ఆడిన ఈ క్షణాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.











