పని ఒత్తిడి, ఆందోళనను నిర్లక్ష్యం చేయొద్దు.
సిరివెలుగు, సిరిసిల్ల: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహించారు. పని ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యలు, నిద్రలేమి, అధిక ఆలోచనలు, ఆందోళన వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పున్నంచందర్ తెలిపారు. దీర్ఘకాలిక విచారం, చిరాకు, భయం, నిద్రలో మార్పులు, ఏకాగ్రత లోపించడం, పనిపై ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. తగినంత నిద్ర, వ్యాయామం, పోషకాహారం తీసుకోవడంతో పాటు మద్యం, పొగాకు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమస్యలను పంచుకోవాలని తెలిపారు. మానసిక సమస్యలను బలహీనతగా భావించకుండా అవసరమైనప్పుడు కౌన్సెలింగ్, వైద్య సహాయం పొందాలని సూచించారు.కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు మాట్లాడుతూ ప్రభుత్వ నేతన్న భీమా, త్రిఫ్ట్ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.











