డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ పేరుతో రూ.4,200 కాజేత.
నిందితుడి అరెస్ట్, రిమాండ్.
సిరివెలుగు, వేములవాడ: ఆర్టీఓ అధికారినంటూ ఫోన్లో పరిచయం చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ పేరుతో డబ్బులు కాజేసిన వ్యక్తిని వేములవాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ వివరాలు తెలిపారు. గురువారం వేములవాడ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. హన్మాజిపేటకు చెందిన శ్రీనివాస్‌కు జూన్ 1న ఫోన్ చేసిన నిందితుడు వేములవాడ పట్టణానికి చెందిన నీరటి తిరుమల్ తాను సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం నుంచి నరేష్నంటూ పరిచయం చేసుకున్నాడు. లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే బ్లాక్ అవుతుందని భయపెట్టి, గొంతు మార్చి ఆర్టీఓ అధికారిగా నటించాడు. లైసెన్స్ రెన్యువల్ కోసం ఫోన్‌పే ద్వారా మూడు విడతల్లో రూ.4,200 బదిలీ చేయించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు, మొబైల్ నంబర్లు, వాయిస్ రికార్డింగ్, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. గురువారం వేములవాడ అర్బన్ కాలనీలో అతడిని అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన వివో మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో ఆర్టీఓ కన్సల్టెన్సీ షాపులో పనిచేసిన అనుభవంతో పరిచయస్తులను లక్ష్యంగా చేసుకుని, ఇదే తరహాలో మరికొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీఓ, పోలీస్, బ్యాంక్ అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద సైబర్ మోసాలు జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.











