సిరిసిల్లాకు సీఎం రేవంత్..!

ఈ నెలాఖరులోగా సిరిసిల్లలో సీఎం టూర్? బిఆర్ఎస్ ఎత్తుగడలకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. కేటీఆర్ కంచుకోటలో బలప్రదర్శనకు రంగం సిద్ధం. సిటీ నడిబొడ్డున భారీ బహిరంగ సభకు సన్నాహాలు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈనెల 30న సభ. ఆ తరువాత సిద్దిపేట, గజ్వేల్ లోనూ. బిఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్గా వ్యూహం. సీఎం సిరిసిల్ల టూర్ పై పెరుగుతున్న ఉత్కంఠ. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. సిరివెలుగు, తెలంగాణ బ్యూరో, రాజన్న సిరిసిల్ల: అతి త్వరలో సిరిసిల్లలో సీఎం…

ఈ నెలాఖరులోగా సిరిసిల్లలో సీఎం టూర్?

బిఆర్ఎస్ ఎత్తుగడలకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.

కేటీఆర్ కంచుకోటలో బలప్రదర్శనకు రంగం సిద్ధం.

సిటీ నడిబొడ్డున భారీ బహిరంగ సభకు సన్నాహాలు.

అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈనెల 30న సభ.

ఆ తరువాత సిద్దిపేట, గజ్వేల్ లోనూ.

బిఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్గా వ్యూహం.

సీఎం సిరిసిల్ల టూర్ పై పెరుగుతున్న ఉత్కంఠ.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.

సిరివెలుగు, తెలంగాణ బ్యూరో, రాజన్న సిరిసిల్ల: అతి త్వరలో సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో సిరిసిల్ల, సిద్దిపేటలపై దండయాత్ర చేస్తానని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నకిరేకల్ సభలో బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎత్తుగడలకు దీటుగా సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో నడి బొడ్డున భారీ బహిరంగ సభతో కేటీఆర్ కంచుకోటలో రాజకీయ బల ప్రదర్శనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చర్చ కొనసాగుతోంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం టూర్ పూర్తి కాగానే, సిద్దిపేట గజ్వేల్ లోను భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. బిఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్ గా కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎత్తుగడలకు ధీటుగా సమాధానం ఇవ్వడంతో పాటు, ఆ పార్టీపై రాజకీయ ఒత్తిడి పెంచేలా సీఎం పర్యటనను కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో సీఎం సభను భారీగా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపడంతో పాటు బీఆర్‌ఎస్‌ బలమైన ప్రాంతంలో కాంగ్రెస్‌ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సిరిసిల్లలో మొదటి పర్యటన కావడంతో ఇప్పటినుండే నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

వరుస వివాదాల్లో బిఆర్ఎస్.

ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ఎర్రవల్లిలో పసుపు నీళ్ల వ్యవహారం, స్పీకర్ పై అనిచిత వ్యాఖ్యలు వంటి వరుస వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలతో బీఆర్‌ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిరిసిల్లలో సీఎం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో సీఎం బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్‌ తన రాజకీయ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా సిద్దిపేట, గజ్వేల్ లోనూ సీఎం పర్యటనలు, బహిరంగ సభలు ఉండే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సిరిసిల్లతో పాటు సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల అభివృద్ధి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ మూడు నియోజకవర్గాలు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, కేసీఆర్‌తో నేరుగా ముడిపడి ఉండటంతో సీఎం పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొనుంది.

‘జీవో22ఏ’ భూముల అంశంపై ప్రత్యేక దృష్టి.

గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలో జరిగిన అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియాలతో పాటు బతుకమ్మ చీరల కుంభకోణం, ముఖ్యంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంపై సిరిసిల్ల పర్యటనలో సీఎం ప్రసంగించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అలాగే స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలతో పాటు జీవో 22ఏ భూముల వ్యవహారంపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందనే అంశం జిల్లా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీఆర్‌ఎస్‌పై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్‌ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిరిసిల్లలో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై దెబ్బకొట్టే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

సీఎం పర్యటనతో నేరెళ్లకు న్యాయం జరిగినా..?

గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఆగడాలకు పోలీసుల అత్యుత్సాహానికి జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దళితులు థర్డ్ డిగ్రీ హింసకు గురైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తరువాత మొదటి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి భాధిత దళిత కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన విషయం విధితమే. ఇంతలోనే దాదాపు రెండున్నర ఏళ్ళు గడవడం, ఇటీవల బాధితులలో ఒకడైన గంధం గోపాల్ మృతి చెందడం బాధాకరమైన విషయం. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తమ పదేళ్ల నిరీక్షణకు న్యాయం జరుగుతుందని నేరళ్ల బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేటీఆర్‌ కంచుకోటలో కాంగ్రెస్‌ బలప్రదర్శన?

సిరిసిల్ల అంటేనే కేటీఆర్ అడ్డా. చాలా కాలంగా కేటీఆర్‌ రాజకీయ ప్రస్థానంలో కీలక నియోజకవర్గంగా ఉంది. కేటీఆర్ కు కంచుకోటగా పిలువబడే సిరిసిల్లలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించడం అంత ఆషామాసి కాదు. బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే వ్యూహంతో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు బీఆర్‌ఎస్‌ పాలనపై సీఎం విమర్శలు గుప్పించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సీఎం సిరిసిల్ల పర్యటన ఎప్పుడెప్పుడేంటూ అంటూ జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ సిరిసిల్ల పై వరాల జల్లులు కురిపించేనా… నేతన్నల తలరాతలు ఇప్పటికైనా పూర్తిగా మారినా… అంటూ నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

30న సీఎం సిరిసిల్ల పర్యటన?

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా సీఎం సిరిసిల్ల పర్యటన ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నడిబొడ్డున సీఎం భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు రోజుల్లో సీఎం వీరితో భేటీ అయి, సిరిసిల్ల పర్యటనపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ నెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ సీఎం సిరిసిల్ల పర్యటనపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!