రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానం.
ఈవో రమాదేవి ఆదేశాలతో చురుగ్గా ఏర్పాట్లు.
పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఈఈ రాజేష్.
సిరివెలుగు, వేములవాడ: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతీకలైన సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) పర్వదినాల నేపథ్యంలోరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులు ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ఆలయ యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
విద్యుత్ కాంతులతో శోభాయమానం.
ఉత్సవాల సందర్భంగా ఈవో రమాదేవి ఆదేశాలతో భీమేశ్వర స్వామి ఆలయానికి రంగురంగుల విద్యుద్దీపాలు, సీరియల్ సెట్లు, హై-మాస్ట్ ఫోకస్ లైట్లను అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ మండపంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలువుదీర్చేందుకు ప్రత్యేక పూజా మండపాన్ని సైతం సిద్ధం చేస్తున్నారు.
భీమేశ్వర సదన్ వద్ద బతుకమ్మ, దాండియా వేడుకలు.
మహిళా భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా బతుకమ్మ ఆడటానికి, కోలాటం, దాండియా నృత్యాలు చేయడానికి వీలుగా భీమేశ్వర సదన్ వద్ద ఉన్న విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని సిద్ధం చేస్తున్నారు. అక్కడ విద్యుత్ వెలుగులతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. బతుకమ్మ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవస్థానం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు.
క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ఈఈ రాజేష్.
ఆలయ ఈవో రమాదేవి సూచనలతో భీమేశ్వరాలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, ముస్తాబు పనులను ఆలయ ఈఈ రాజేష్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈఈతో పాటు వెంట ఇంజనీరింగ్ విభాగం అధికారులు, దేవస్థాన సిబ్బంది ఏర్పాట్ల పనుల్లో మునిగిపోయారు.











