పేదలకు మెరుగైన వైద్యం.. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

వేములవాడ ఆసుపత్రిలో మోకాళ్ల శస్త్రచికిత్సలకు సీ-ఆర్మ్ యంత్రం. వినికిడి పరీక్షలు, ప్రత్యేక చికిత్సలకు ఏర్పాట్లు.పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఆది శ్రీనివాస్. హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, వేములవాడ: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన తొమ్మిదో…

వేములవాడ ఆసుపత్రిలో మోకాళ్ల శస్త్రచికిత్సలకు సీ-ఆర్మ్ యంత్రం.

వినికిడి పరీక్షలు, ప్రత్యేక చికిత్సలకు ఏర్పాట్లు.పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో ఆది శ్రీనివాస్.

హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

సిరివెలుగు, వేములవాడ: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన తొమ్మిదో జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రిలో బేరా యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పోషణ మాసం సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలు, బెల్లం, నువ్వులు, బాలామృతంతో తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.

మోకాళ్ల శస్త్రచికిత్సలకు ఆధునిక యంత్రం.

వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా మోకాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సలకు అవసరమైన సీ-ఆర్మ్ యంత్రం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.

చిన్నారుల సమస్యలను తొలిదశలోనే గుర్తించాలి.

చిన్నారుల్లో వినికిడి లోపం, మాటలు రాకపోవడం, శారీరక ఎదుగుదలలో సమస్యలు వంటి లోపాలను చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించడం ముఖ్యమని ఆది శ్రీనివాస్ అన్నారు. అవసరమైన చిన్నారులకు హైదరాబాద్‌లోని నిమ్స్‌, సరోజినీదేవి, ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ ఆసుపత్రిలోనే ప్రత్యేక చికిత్సలు, ఫిజియోథెరపీ సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. డీఈఐసీ కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు పొందిన సుమారు 18 మంది చిన్నారులు శారీరక ఇబ్బందుల నుంచి కోలుకుని నడవగలుగుతున్నారని వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళా స్వయం సహాయక సంఘాల స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.

చిన్నారుల ఎత్తు, బరువును ప్రతి నెలా నమోదు చేసి, వారి ఎదుగుదలకు అనుగుణంగా పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే సమీప అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటలు, పాటల ద్వారా ప్రాథమిక విద్య అందుతుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళవారం నిర్వహించే ‘ప్రతి మంగళవారం పది నిమిషాలు’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులు, పోషకాహార పంపిణీ, బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వేములవాడ ఆసుపత్రిలో బేరా యంత్రం వినియోగంలో లేకపోవడాన్ని గతంలో గుర్తించి, ప్రత్యేక గది, అవసరమైన ఏర్పాట్లు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ప్రజలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!