మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో అధికారి సస్పెన్షన్!
అసలు సిరిసిల్ల విద్యుత్ శాఖలో ఏం జరుగుతోంది?
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల కరెంట్ శాఖలో ఓ అధికారి తీరు కలకలం రేపుతోంది. శాఖ ప్రధాన విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ప్రారంభమైన వ్యవహారం.. ఉమెన్స్ కమిటీ విచారణ, ఆపై విజిలెన్స్ దర్యాప్తు వరకు వెళ్లినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని శాఖ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఈ తాతంగమంతా ఆలస్యంగా వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగులోకి..

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తనను సదరు అధికారి వేధిస్తున్నారంటూ సిరిసిల్ల విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) శ్రీనివాస్ రావుకు ఫిర్యాదు చేసినట్లు చేసింది. ఫిర్యాదును పరిశీలించిన ఎస్ఈ.. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఉమెన్స్ కమిటీకి ఆదేశించారు. కమిటీ విచారణ అనంతరం తన నివేదికను ఎస్ఈకి సమర్పించగా, ఆ నివేదికను తదుపరి విచారణ నిమిత్తం విజిలెన్స్ అధికారులకు పంపినట్లు సమాచారం. ఉమెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ అధికారులు కూడా వ్యవహారంపై విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణ అనంతరం సంబంధిత నివేదికలను శాఖ సీఎండీకి పంపినట్లు తెలిసింది. విజిలెన్స్ నివేదికలను పరిశీలించిన సీఎండీ.. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈ శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేయగా, ఎస్ఈ సూచనల మేరకు సెస్ ఎండీ తిరుపతి సదరు అధికారిపై ఈనెల 1న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
గతంలోనూ ఆరోపణలు.. ఫిర్యాదుల పరంపర?

సదరు అధికారిపై గతంలోనూ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. శాఖలోని కీలక విభాగాల్లో పైరవీల ద్వారా పోస్టింగులు పొందుతున్నారనే సదరు అధికారిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సదరు అధికారి గతంలో విధులు నిర్వర్తించిన విభాగాల్లో అవినీతికి పాల్పడ్డట్లు శాఖ ఉద్యోగుల్లో బహిరంగ చర్చ కొనసాగింది. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్లో ఆయన కీలక పదవిలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మహిళా ఉద్యోగి ఫిర్యాదు నుంచి ప్రారంభమైన వ్యవహారం ఉమెన్స్ కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తు, చివరకు సస్పెన్షన్ వరకు చేరడంతో సిరిసిల్ల విద్యుత్ శాఖలో ఈ అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అయితే శాఖలో ఓ స్థాయి అధికారి హోదాలో ఉంటూ, యూనియన్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు అధికారి మహిళా ఉద్యోగులపై ఇలా ప్రవర్తించడం పట్ల తోటి ఉద్యోగులు, యూనియన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి విచారణ జరిపి అధికారిపై చర్యలు తీసుకున్న విద్యుత్ శాఖ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.











