ఘనంగా ప్రజాపాలన దినోత్సవం.
హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం జిల్లాలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.390 కోట్లు మంజూరయ్యాయని, 46,492 మంది రైతులకు రూ.370.75 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 7,088 ఇళ్లు మంజూరు కాగా 3,797 పూర్తయ్యాయని, మహిళా సంఘాలకు రూ.187 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని వివరించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు భారీ ఆర్డర్లు, రైతులకు రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ, విద్యా రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.











