కబ్జాకు గురైన 8 వేల ఎకరాలను స్వాధీనం చేసుకోవాలి.
చర్యలు లేకుంటే పోరాటం తప్పదు.
సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో కబ్జాకు గురైన సుమారు 8 వేల ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల కబ్జాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పటివరకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారులు గుర్తించిన 2,400 ఎకరాల భూముల పూర్తి వివరాలను వెల్లడించాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన భూములన్నింటినీ రికవరీ చేసి నిరుపేదలకు అందించాలని, ప్రభుత్వం స్పందించకపోతే భాజపా ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేపడతామని గోపి హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











