తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణి ప్రారంభం.
హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
సిరివెలుగు, వేములవాడ : రాజన్నకు భక్తులు సమర్పించిన కోడెలు ఇక సన్న, చిన్నకారు రైతులకు ‘రాజన్న ప్రసాదం’గా చేరుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భక్తుల మొక్కులతో ఆలయానికి చేరిన కోడెలను గోశాలలో సంరక్షిస్తూ.. అర్హులైన నిరుపేద రైతులకు జతలుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం తిప్పాపూర్ గోశాలలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసిఆయన ముఖ్య అతిథులుగా హాజరై పలువురు రైతులకు కోడెలను పంపిణి చేశారు. గతంలో ఆలయానికి చేరిన కోడెలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే సమయంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో.. వాటిని అవసరమైన సన్న, చిన్నకారు రైతులకు అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఆన్లైన్ దరఖాస్తుతో రైతుల ఎంపిక.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి అర్హులైన రైతులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. రైతుకు ఉన్న భూమి, కోడెలను సంరక్షించేందుకు అవసరమైన నీరు, మేత, దాణా వంటి సదుపాయాలను పరిశీలించి అర్హత నిర్ణయిస్తున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. స్వీయ ధ్రువీకరణ పత్రాలతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కోడెలను అందిస్తున్నట్లు తెలిపారు.
‘రాజన్న ప్రసాదం’గా చూసుకోవాలి.
రైతులు తమకు అందిన కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి జాగ్రత్తగా సంరక్షించాలని ఆది శ్రీనివాస్ కోరారు. బిడ్డలను ఎలా చూసుకుంటారో అలాగే కోడెలను చూసుకోవాలని సూచించారు. కోడెల సంరక్షణపై దేవాదాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని, అక్రమంగా తరలించడం, ఇతర మార్గాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలు మరవని చిన్న కోడెలను, జెర్సీ జాతి కోడెలను సమర్పించవద్దని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. చిన్న కోడెలను దూర ప్రాంతాల నుంచి తరలించడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఎదిగిన, ఆరోగ్యంగా ఉన్న దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని సూచించారు. భక్తులు ఆలయంలో నిజమైన కోడెను సమర్పించే అవకాశం ఉందని, ఆలయ అధికారులను సంప్రదించి నిర్ణీత రుసుం చెల్లించి ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు.
45 ఎకరాల్లో అధునాతన గోశాల.
వేములవాడలో కోడెల సంరక్షణకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేయనున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని, పనులు త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న కోడెలను ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించేందుకు ఎకరం స్థలాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక వెటర్నరీ వైద్యుడిని నియమించేందుకు కూడా ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. తీవ్ర అనారోగ్యంతో, బలహీన స్థితిలో ఉన్న కోడెలను చివరి దశలో గోశాలలో వదిలివెళ్లడం వల్ల వాటి సంరక్షణ కష్టమవుతోందన్నారు. అలాంటి కోడెలను గోశాలలో వదిలే ముందు నిర్వాహకులను సంప్రదించి అధికారికంగా అప్పగించాలని సూచించారు.
రూ.250 కోట్లతో ఆలయ అభివృద్ధి.
భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనాలు, వసతులు, మొక్కుల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.250 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయని, వివిధ మొక్కుల టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ ఛైర్మన్ రాకేశ్, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే.ఎస్.బీ. కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.











